How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

అష్టాదశ పురాణములు (18 పురాణాల సారము)


మన సంస్కృత వాజ్మయములో వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు అను . ఈ సర్వవాజ్మయమునందును వేదము లగ్రతాంబూలము నందుకోనును. వేదములనుండియే పరమాత్ముడు సర్వజగాములను నిర్మించెనట. (యోవేదేభ్యోభిలం జగత్ నిర్మమే). నిర్మించినవానిని సక్రమముగా నడిపించుటకు శాస్త్రము లవసరమైనవి. ఇవి ప్రభువులవలె శాసించుచు వేదధర్మములను లోకము ఆచరించునట్లు చేయును. ఈ శాస్త్రములుకూడ వేదధర్మముల ననుసరించియే చెప్పును. ఈ విషయమునే కాళిదాసు, “శ్రుతే రివార్థం స్మృతి రన్వగచ్ఛత్” అని చెప్పినాడు. వేదధర్మములను పాటించని శాస్త్రములను నాస్తిక శాస్త్రములని మన పూర్వులు నిరాకరించిరి.
అంతయుబాగుగానున్నది. లోకములో అందరు శాసనములకు లోబడుదురా? పదేపదే ఆజ్ఞాపించినచో కొందరు మొండి కెత్తుదురు. వారిమీద ఆజ్ఞలకంటే మంచి ఉపదేశములే చక్కగా పనిచేయును. ఈ పురాణములు అ పని చేయుటకే వెలసినవి. అందుకే వీనిని “మిత్రసమ్మితములు” అందురు. అనగా మిత్రునివలె హితము చెప్పునవి అర్థము.
వీనిలో కొన్నిచోట్ల ధర్మములు సూటిగా చెప్పబడును. కొన్నిచోట్ల కథారూపముగా వ్యంగ్యమర్యాదతో బోధింపబడును. ఆ ధర్మసూక్ష్మములు గ్రహించువారి మేధాశక్తిని బట్టి మొరయుచుండును. “నీటికొలది తామర” గదా!
ఈ పురాణములు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, పద్మ, వరాహ, శ్వేతవరాహాది కల్పములు, అప్పటి సృష్టి విశేషములు, త్రిమూర్తులు, సూర్యచంద్రాదులు, దేవతలు, భూరాదిలోకములు, వర్షములు (దేశములు), ద్వీపములు, వాని దూరములు, కాలము, దాని ప్రమాణములు, దేవమానవ కాలప్రమాణభేదములు, భగవానుని అవతారములు, వాని ప్రయోజనములు, సామాన్య ధర్మములు, విశేష ధర్మములు; కవిత్వ శిల్పాదికళలు, వైద్యప్రక్రియలు, దేవతల – రాక్షసుల స్వరూప స్వభావములు, దేవాసురులకు సంగ్రామములు; మహర్షులు, వారి తపః ప్రభావములు ఇట్లు అనేక విషయముల వివరణముతో నిండియున్నది.
పూర్వము వేదశాస్త్రములు చదువగానే అతనిని పండితుడుగా లెక్కించేవారుకాదు. పురాణ పరిజ్ఞానము కూడా కావలెను. అప్పటికిగాని అతని పాండిత్యము సంపూర్ణత పొందదు. 
నన్నయ, శ్రీనాథుడు, మున్నగు తెలుగు కవులు కూడ “బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతులము” అని చెప్పుకొన్నారు.
వేదములందుకూడ పురాణముల ప్రాశస్త్యము చెప్పబడినది. “యదృచో – దీతే ….బ్రహ్మవర్చసే నాన్నద్యేన చ తర్పయంతి” అని స్వాధ్యాయ బ్రాహ్మణము. అనగా: “ఋగ్వేదము నధ్యయనము చేసినచో క్షీరాహుతులతో దేవతలను తృప్తిపరచినట్లగును. యుజుర్వేదమును నేర్చినచో ఘృతాహుతులతోను, సామవేదమును నేర్చినచో సోమాహుతులతోను, అధర్వణ వేదమును నేర్చినచో మధ్వాహుతులతోను, బ్రాహ్మణములు – ఇతిహాసములు – పురాణములు – కల్పములు – గాధలు చదివినచో మేదాహుతులతోను దేవతలను తృప్తిపరచినవాడగును. అట్లు తృప్తినొందిన దేవతలు ఆ చదివినవానికి ఆయువు, తేజము, బ్రహ్మవర్చస్సు, సంపదలు, కీర్తి, ఆరోగ్యము మున్నగు వానినిచ్చి పోషింతురు” అని అర్థము.
ఇట్లు మన ప్రాచీనులు పురాణములకు వేదములతో సమానమైన గౌరవము ఇచ్చియున్నారు.
శ్వేత వరాహకల్పము (ఇప్పటిది) లోని ఇరువది ఎనిమిదవ మహాయుగాములో కృష్ణద్వైపాయనుడను పేరుగల వ్యాసుడు పదునెనిమిది పురాణములను రచించేనని చెప్పుదురు. శ్రీనాథుని కాశీఖండములో, శివుడు వ్యాసునిపై కోపించి, “ఎట్లు పురాణముల్ పదియునెన్మిది చెప్పితివి?” అని యున్నది. కావున ఈ 18 పురాణములను వ్యాదుడే వ్రాసెనని మనవారి విశ్వాసము.
ఒక్కమాటలో చెప్పవలెనన్నచో ఈ పురాణములు మన సంస్కృతిని ప్రతిబింబింపచేయు “విజ్ఞాన సర్వస్వములు”.
“నహి విజ్ఞాన సర్వసం పురాణా ద్వేదసమ్మితాత్”
ఇది పురాణముల పరిచయము.




0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE