How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

టెన్త్ తర్వాత ఏం చదవాలి?


టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులు కావడమంటే చదువుల చౌరస్తాలో నిలబడటం. టెన్త్ తర్వాత ఏం చదవాలంటే జవాబు సులభమే. ఆ తర్వాత ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడే వేసుకుంటే సమాధానాన్ని అన్వేషించడానికి సమయం పడుతుంది. టెన్త్ తర్వాత ఇంటర్ చదవడం సహజంగా జరిగే పరిణామం. అయితే ఇంటర్ తర్వాత మరో మూడు, నాలుగేళ్ళ గ్రాడ్యుయేషన్‌ను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ముందుగా పిల్లల అభిరుచి - ఆ పై భవిష్యత్తులో డిమాండ్ ఉన్న కోర్సులు ఈ రెండింటిపై తగిన అవగాహన ఉంటేనే తల్లిదండ్రులు సముచిత నిర్ణయం తీసుకోగలరు.

పదో తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల అదు పాజ్ఞల్లో పెరుగుతారు. వారి అడుగు జాడల్లో నడుస్తారు. పెద్దల ఇష్టాలే తమ అభిరుచులుగా మలుచుకొంటారు. పదో తరగతి తర్వాత చదువుల విషయంలో నిర్ణయాలు కేవలం తల్లిదండ్రుల అభిరుచి మేరకు తీసుకుంటే భవిష్యత్తులో రాణించలేక పోవచ్చు.

ఇంటర్మీడియట్ స్థాయిలో కోర్సు ఎంపిక చేసుకోవటమంటే విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించడమే అవుతుంది. విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును నిర్దేశించేది నేడు ఎంపిక చేసుకున్న కోర్సులే అనే సత్యం మరువరానిది. ఒక్కసారి ఈ కోర్సు ఎంపికలో తప్పటడుగు వేస్తే, విద్యార్థి గమ్యమే మారిపోతుంది. పోను పోను ఆ మార్గం ముళ్ళతో రాళ్ళతో ముందుకు సాగనీయదు. అయినా ఎన్నో కష్టాలకోర్చి ముందుకు సాగితే, చివరకు ఆమార్గం గమ్యం చేరకుండానే ముగిసిపోతుంది. 
కోర్సు ఎంపిక విద్యార్థి జీవితాన్నే నిర్ధేశిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎంతో జాగరూకతతో అడుగేయాలి. కెరీర్ ఎంపికలో అభిరుచికి ప్రాధాన్యత నిచ్చినా, తల్లిదండ్రులు, టీచర్లు, కెరీర్ కౌన్సిలర్లు, శ్రేయోభి లాషులు మొదలైనవారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో ఉజ్వలంగా వెలిగే రంగాలను ఎంపిక చేసుకోవాలి.

పదోతరగతి పూర్తి చేసిన అభ్య ర్థులు తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వడానికి పదోతరగతిలో వచ్చిన మార్కుల మీద ఆధారపడతారు. వీరికి కూడా తెలిసిన కెరీర్స్ మూడు మాత్రమే. అవి ఆర్ట్స్, సైన్స్, కామర్స్. ‘‘పదో తరగతిలో మేథ్స్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయి, కాబట్టి ఎంపిసి గ్రూపు తీసుకో అని’’ ఉచిత సలహా ఇచ్చేవారు ప్రతిచోట తారసపడతారు. ఇటువంటి అసమగ్ర సల హాల వల్ల విద్యార్థులు తమ అభిరుచికి భిన్నమైన కెరీర్‌లో ప్రవేశించే ప్రమాదం ఉంది. అందు వల్ల కెరీర్‌ను నిర్ణయించుకునే ముందు అనేక అంశాలను దృష్టిలో వుంచుకోవాలి. 

హైస్కూల్‌లో మొత్తం అన్ని సబ్జెక్టులు చదవాలి. అందువల్ల వీరికి కొన్ని సబెక్టులపై ఆసక్తి ఉండవచ్చు. కేవ లం అలా ఆసక్తి ఉన్న వాటిలో రాణించ గలరనే అంశాన్ని ఖచ్చితంగా చెప్పలేం. లెక్కలు బాగా ఆసక్తి ఉండి టీచర్ సరిగ్గా చెప్పకపోవటం, ఆయన దగ్గర భయపడటం వల్ల మేథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చి ఏ హిందీలోనో ఎక్కువ మార్కులు సంపాదించ వచ్చు. అందువల్ల ఏకెరీర్‌లో స్థిరపడాలనే విషయంపై అభ్యర్థికి ఒక అవగాహన కలగాలి. ఈ అవగాహనను 10+2 ప్యాట్రన్‌లో 9వతరగతి నుండే కల్పించడం మంచిది. విద్యార్థి కెరీర్‌ను నిర్ణయించుకోడానికి టీచర్లు, తల్లి దండ్రుల ప్రలోభాలు ఎంత మాత్రం పనికిరావు. కానీ అభ్యర్థికి సంబంధించిన రంగంలో స్థిరపడానికి కావలసిన అవగాహన కల్పిస్తే చాలు తన కెరీర్ విద్యార్థే నిర్దేశించుకుంటాడు. ముఖ్యంగా కెరీర్‌ను నిర్ణయించు కునే ముందు రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి :
1) మీ ఆసక్తి, మీ శక్తి సామర్థ్యాలు
2) సంబంధించిన రంగంలో మీరు సేకరించిన సమాచారం, అవగాహన
సాధారణంగా అందరికీ తెలిసిన అంశాలు సైన్స్, ఆర్ట్స్, కామర్స్. వీటితోపాటు లాంగ్వేజీలు కూడా ఉంటాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత వీటిలో ఏదైనా ఒక అంశంగా తీసుకుని చదువుతారు.

సైన్స్ స్ట్రీమ్
ఇందులో ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టులుంటాయి. కొంత మంది లెక్కల గురించి ఆసక్తి ఉండి కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఒక పట్టాన కొరుకుడు పడవు అనుకునేవారు జువాలజీ వంటి సబ్జెక్టులు చదవవచ్చు. ప్రస్తుతం మేథమేటిక్స్ కూడా ఎక్కువ మంది చదువుతున్నారు. మీకు సైన్స్ సబ్జెక్టులు అంటే అంతగా ఆసక్తి లేకుండా మాథ్స్ సబ్జెక్టు మీద ఆసక్తి ఉంటే కొన్ని ఆర్ట్స్ సబ్జెక్టుల కాంబినేషన్‌తో మేథ్స్ అవకాశం ఉంది. అయితే కేవలం ఇవే సబెక్టులు ఉంటాయనుకోనవసరంలేదు. ఇందులో వివిధ సైన్స్ ఫ్యాకల్టీలున్నాయి. 

ఆసక్తికి తగిన విధంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్ బాటనీ, జువాలజీ,జాగ్రఫీ హోమ్ సైన్స్ లాంటి సబ్జెక్టులుంటాయి. సైన్స్‌లోనే ఎంపిసి వంటి గ్రూపు చదవినపుడు ఇంజనీరింగ్ సైడ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జి, కంప్యూటర్ వంటి కోర్సులు చేయవచ్చు. మెడిసిన్ చదవాలనుకునేవారు మెడిసిన్, డెంటిస్ట్రీ, అగ్రికల్చరల్ సైన్స్, డైరీ సైన్స్, బయాలాజికల్ సైన్స్ (బయోకెమిస్ట్రీ , బయోటెక్నాలజీ) కోర్సులు బాగుంటాయి. ఈ రంగంలోకి రావ డానికి బైపిసి గ్రూపులు బాగుంటాయన్నది తెలిసిన విషయమే. 

ఈ కోర్సులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులను మర్చిపోకూడదు. వీటిలో ఎక్కువగా సైన్స్ వారికే అవకాశం ఇస్తున్నారు. వాటిలో ఫిజియోథెరఫీ, నర్సింగ్, కంప్యూటర్ బిజినెస్, ఆడ్మినిస్ట్రేషన్ , హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ మొదలైన స్పెషలైజేషన్స్. ఇవే కాకుండా వివిధ సంస్థలు అఫర్ చేసే ఫ్యాషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ డిజైనింగ్, ప్యాకేజింగ్, ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్, ఇంజినీరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ మొదలైనవి ఎంపిక చేసుకోవచ్చు.

ఆర్ట్స్ /హ్యూమానిటీస్
లెక్కలు, సైన్స్ వంటి సబ్జెక్టులు కొరుకు పడని వారు, దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులు, అర్థికాంశాలపై గణన చేసే ఆసక్తి ఉన్నవారు ఆర్ట్స్ / హ్యూమనిటీస్ కోర్సులు ఎంపిక చేసుకో వచ్చు. వీరు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత హెచ్ ఇ సి లాంటి గ్రూపులు తీసుకుంటారు. ఇందులో సివిక్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటి సబ్జెక్టులుంటాయి.

కామర్స్ స్ట్రీమ్
వివిధ వ్యాపార పట్టికలు, లావాదేవీల్లో ఆసక్తి ఉన్నవారు కామర్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం కామర్స్ సబ్జెక్టుకు కూడా ఎక్కువ విలువే ఉంది. ఈ రంగంలో ఎక్కువ అవకాశాలు పొందగోరేవారికి చార్టర్డ్ అకౌంట్స్,కాస్ట్ అకౌంట్స్, ఐసిడబ్ల్యుఎ, ఎసిఎస్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. 

లాంగ్వేజెస్
లాంగ్వేజిలంటే ఇష్టపడేవారు వాటినే ప్రత్యేక సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. అందులో ఇంగ్లీష్, తెలుగు కాకుండా విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచీకరణలో భాగంగా రష్యన్, ఫ్రెంచ్, జపనీస్,చైనీస్ వంటి భాషలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే విదేశీ భాషలు, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, కంపేరిటివ్ స్టడీస్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి.

ఒకేషనల్ కోర్సులు
జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఒకేషనల్ కోర్సులు బాగుంటాయి. ఇటువంటి కోర్సులే కొన్ని యూనివ ర్సిటీలలో ఐదు సంవత్సరాల కాలవ్యవధితో ఉండే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏనిమల్ హజ్బెండరీ అండ్ అగ్రికల్చర్
క్రాప్ ప్రొడక్షన్, డైరీయింగ్, సెరికల్చర్,ఫిషరీస్, ఫిసికల్చర్, ఆక్వాకల్చర్ మొదలైనవి ఉన్నాయి.

బిజినెస్ మేనేజ్‌మెట్
ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ ప్రాక్టీస్ అండ్ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, అఫీస్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజ్‌మెంట్, బేసిక్ ఫైనాన్సియల్ సర్వీసులు.

డిజైనింగ్
ఫ్యాషన్ అండ్ గార్మెంట్ మేకింగ్, కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్ క్రచ్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్.

పారా మెడికల్
డెంటల్ హైజినిస్ట్, డెంటల్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్, మెడికల్ అసిస్టెన్స్, క్లినికల్ అసిస్టెన్స్, ఫిజియోథెరపీ, ఎక్స్-రే టెక్నీషియన్, అప్తాలమిక్ టెక్నీషియన్.
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
సర్వే అండ్ ఎస్టిమేటర్ రోడ్ అండ్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ టెక్నీషియన్, వాటర్ సెప్లై అండ్ శానిటరీ ఇంజినీరింగ్ టెక్నీషి యన్, ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లైన్స్‌సెస్ అండ్ రీవైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎయిర్ - కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్, ఏ కెరీర్‌ను మొదలు పెట్టినా వెంటనే గమ్యాన్ని చేరుకున్నామ నుకోకూడదు. ఇప్పుడు ప్రారంభించిన కెరీర్ మీ జీవిత కాలం అంతా ఉండాలి. అందుకుగాను కొన్ని సంవత్సరాల క్రితమే అనలైజ్ చేసి భవిష్యత్‌ను నిర్ణయించడం కష్టం. తర్వాత సంబంధించిన రంగంలో ఒడిదుడుకులు కూడా తట్టుకునేటట్లు ఉండాలి.

ప్రస్తుతం ఏ కెరీర్ ఎంపిక చేసుకున్నా ఎంతో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. అందువల్ల వివిధ కంప్యూటర్ కోర్సులు లోతుగా కాకపోయినా ఫండమెం టల్స్, వివిధ లాంగ్వేజీల ఫండమెంటల్స్ తెలుసుకుంటే తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సాఫ్ట్‌వేర్‌లోనే స్థిరపడే అవకాశం కూడా రావచ్చు.


పేరెంట్స్ అభిప్రాయాలు పిల్లలపై రుద్దవద్దు !
పుట్టిన తక్షణమే చేపపిల్ల ఈదడం నేర్చుకుంటుంది. దానికి నైపుణ్యం ఎవరూ నేర్పలేదు. అపుడే పుట్టిన పక్షి పిల్ల సులువుగా ఎగరడం నేర్చుకుంటుంది. దీనికి ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఏమిటి అని అడిగితే, అజీవులకున్న ఒక ప్రత్యేక నైపుణ్యం అని టక్కున సమాధానం వస్తుంది. ఈ స్పెషల్ స్కిల్‌నే సైకాలజి ‘ఆప్టిట్యూడ్’ అని నామకరణం చేసింది.

అభ్యసం-ఆప్టిట్యూడ్
పైలెటింగ్ ఆప్టిట్యూడ్ లేని ఒక వ్యక్తి, పైలట్ అవ్వాలని ఉవ్విళ్ళూ ఊరుతున్నాడు అని అనుకుందాం. అతని అమ్మానాన్నలు కూడా వంత పాడారనుకుందాం. ఇక అంతే. ముందు వెనుక ఆలోచించకుండా ప్లయింగ్ అకాడమి లో చేరుతాడు. చేరి కష్టపడుతాడు కూడా. కానీ ఈ ఆప్టిట్యూట్ లేనందువలన, ఇతను ఆస్కిల్స్ నేర్చుకోవడానికి నానా తంటాలు పడుతాడు. ఈస్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు అవసరమో, అంతకు రెట్టింపు కాలం ఇతనికి కావలసి వస్తుంది. ఇంత కష్టపడ్డా చివరకు ఇతను ఒక బ్యాడ్ పైలెట్‌గా ఈఫ్లైయింగ్ అకాడమీ నుండి తిరిగివస్తాడు. ఆప్టిట్యూడ్ లేకపోతే, ఆ నైపుణ్యం నేర్చుకోవడం సులభం కాదు అని విద్యార్థులు, వాళ్ళ అమ్మానాన్నలు గుర్తించాలి.

ఆప్టిట్యూడ్ అంటే ఏమిటి? 
ఆప్టిట్యూడ్ అంటే ఒక సహజమైన యోగ్యత, లేదా ఒక సామర్థ్యం లెక్కలకు సంభందించిన సామర్థ్యం, మెకానికల్ రీజనింగ్, మాటలు పదాలకు సంభందించిన యోగ్యతల్ని, ఇందుకు ఊదాహరణంగా తీసుకోవచ్చు. ఈ సామర్థ్యాలు అందరికి ఒకే మాదిరి ఉండవు. కొందరికి లెక్కలకు సంబంధించిన సామర్థ్యం ఎక్కువుంటే, మెకానికల్ రీజనింగ్ తక్కువ మోతాదుల్లో ఉండవచ్చు. విద్యార్థి ఏ ఆప్టిట్యూడ్‌లో మెరుగ్గా ఉన్నాడో, దానికి సంబంధించిన ప్రొఫెషన్‌ను సులభంగా నేర్చుకుంటాడు. అందుకే విద్యార్థులు ఒక ప్రొఫెషన్ ఎంచుకునేముందు, వాళ్ళకు ఆ కోర్స్ పట్ల తమకున్న ఆసక్తి, ఆప్టిట్యూడ్ రెండు చక్కగా అర్థం చేసుకోవాలి. అంతే కాదు, భవిష్యత్తులో ఈ ప్రొఫెషన్‌కు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను అంచనా వేయడానికి చక్కటి సైకలాజికల్ టెస్ట్‌లు ఉన్నాయి.

సొంత నిర్ణయాలు తీసుకొనే పేరెంట్స్ 
కొందరు అమ్మానాన్నలు పిల్లల అభిప్రాయాల్ని, వాళ్ళ సహజ నైపుణ్యాలను పరిగణంలోకి తీసుకోరు. పిల్లలు ఏమీ చదవాలి, వాళ్ళ జీవిత గమ్యాలేంటి అన్న విషయాలను తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నిం చరు. అతి ముఖ్యమైన ఈ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. దీనికి కారణా లేంటి? ఈ నిర్ణయం తీసుకునేప్పుడు పిల్లలను ఎందుకు ఇన్వాల్స్ చెయ్యరు? పేరెంట్స్ ఈ అంశాలను పిల్లలతో ఎందు కు చర్చించరు? ఈ విషయాలను విశ్లే షించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లల ద్వారా కోరిక తీర్చుకోవడం 
ఒక వ్యక్తి తాను ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే తపన బలంగా ఉందనుకందాం. కానీ పరిస్థితులు సహకరించక, అకోరిక తీర్చుకోలేక ఒక సాధారణ ఉద్యోగంలో స్థిరపడితే, అతనిలో ఒక అసంతృప్తి మిగిలిపోతుంది. తాను జీవితంలో ఓడినట్టు భావిస్తాడు. తిరిగి గెలవాలంటే, తాను సాధించక పోయినా తన కూతురు లేదా తన కొడుకు సాధిస్తే, తన కోరిక తీరినట్టే భావిస్తాడు. ఇది బాగానే ఉంది. కానీ ఈ పిల్లలకు ఈ ప్రోఫెషన్‌లో చేరాలని ఆసక్తి, ఆప్టిట్యూడ్ ఉందా అన్న విషయాన్ని గమనించాలి. అమ్మానాన్నల ప్రోద్బలంతో ఆ కోర్సులో చేరితే పిల్లలకు చివరకు ఆశాభంగం మిగులుతుంది. అందుకే తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకునేముందు, ఆత్మ పరిశీలన చేసుకొని మనసుకు కళ్ళెం వెయ్యాలి.

మా బంధువుల్లో అందరూ ఇంజనీర్‌లే 
ఇంకా కొందరు అమ్మానాన్నల లాజిక్ కాస్త గమ్మత్తుగా ఉంటుంది. మా వాళ్లు అందరూ డాక్టర్లే/ఇంజనీర్లే. అలాంటప్పుడు మరి మా వాడు ఇంకేదో ప్రొఫెషన్‌లో స్థిరపడితే అది మావాడికి నామోషి కదండీ. మేము కూడా తలెత్తుకు తిరగగలమా ఇలా ఆలోచించి తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటారు. బంధువుల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అయినంత మాత్రాన, వీళ్ళ పిల్లలు కూడా అదే ప్రొఫెషన్‌లో స్థిర పడవలసిన అవసరం లేదు. సంఘానికి కేవలం ఇంజనీర్లు, డాక్టర్లే మాత్రమే ఉంటే సరిపోదు. అన్ని రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలి. ఇలాంటి కారణాలతో ప్రొఫెషన్ను ఎంచుకోవడం సబబు కాదు.
పిల్లల అభిప్రాయం వాళ్ళ ఆప్టిట్యూడ్‌కు మాత్రమే పెద్ద కుర్చీ వెయ్యాలి అని సైకాలజీ కోడై కూస్తోంది. ఈవిషయాలు గమనిస్తే అమ్మా,నాన్నలు కెరియర్ ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛను ఇస్తారు.

మానసిక పరిధి అంతే 
సొంత నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం తక్కువ మోతాదుల్లో ఉన్న వాళ్ళ మానసిక పరిధి. కొందరు పేరెంట్స్‌కు కొన్ని పాపులర్ కోర్స్‌ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు. వాటి మినహా ఫార్మసీ, ఫిజియోథెరపి, క్లినికల్ సైకాలోజి, జెనెటిక్స్ లాంటి ఇంకా ఏన్నో ప్రొఫెషన్‌కు కోర్సులు ఉన్నా అవి వీళ్ళ మానసిక పరిధిలో ఉండవు. 
కారణం....వీటి గురించి వాళ్ళకు తెలియదు. అలాంటి ప్రొఫెషనల్స్‌కున్నట్టి ఆదరణ, అవకాశాల గురించి వీళ్ళకు అవగాహన ఉండదు.అందుకే నిర్ణయం తీసుకునే ముందు అమ్మానాన్నలు, పిల్లలతో సహా ఒక కౌన్సిలర్‌ను సంప్రదించాలి. వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలు చక్కటి నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తాయి.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE