What Makes Workers Happy? Lessons From the Best Company to Work For
ఆఫీసుకు ఉత్సాహంగా..
ఆదివారాన్ని మినహాయిస్తే పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు ఉండేది ఆఫీస్ లోనే. అంటే సగటున వారంలో 40-50 గంటలు !! ఇంటిదగ్గర్నుంచి ఆఫీసుకు బయల్దేరేటప్పుడు ఏ ఉద్యోగంరా బాబూ అనుకుంటూ బయల్దేరతారు నూటికి 80 శాతం ఉద్యోగులు. ఎందుకు ఈ నిరాశక్తత అని అడిగి చూడండి. చేంతాడంత కష్టాల లిస్టు చదువుతారు. బాస్ మంచోడు కాడు, నా కొలిగ్‌తో పడదు, నాకే ఎక్కువ పని అప్పచెప్తారు, సరైన వేతనం ఇవ్వక పోయినా ఉద్యోగం చేయడం తప్పట్లేదు, నాకన్నా సీనియర్ మా బాస్‌కి నాపై లేనిపోనివి చెప్తున్నాడు, నేను జూనియర్ అని నాపై అజమాయిషీ చేస్తున్నారు...సవా లక్షా కష్టాలు తామొక్కరే ఎలా భరిస్తున్నారో ఎంతో ఉత్సాహంగా చెప్పుకొస్తారు. వాళ్లు చెప్పే వాటిలో కొన్ని నిజమే అవ్వచ్చు, పోనీ అన్నీ నిజమే అనుకోండి, అయితే వాటిని పదేపదే తలచుకొని బాధపడడం వల్ల ఆ సమస్యలు తీరవు కదా? మరి వీటినుంచి బయటపడేదెలా... అసలు వీటికి పరిష్కారం ఉంటుందా! అంటే కచ్ఛితంగా ఉంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ సమస్యల్నుంచి బయటపడడమే కాదు. అవసరమైతే ఆదివారం పనిచేయడానికీ సిద్ధం అంటారు. అవేంటో చూద్దామా మరి....
ఆఫీసుకు వెళ్లేముందే ఈరోజంతా ఉత్సాహంగా ఉండాలి అని నిర్ణయించుకుని వెళ్లండి. వెళ్ళిన వెంటనే ఆరోజు మీరు చేయాల్సిన పనుల్ని ఓసారి సరిచూసుకోండి. ప్రాధాన్యత ఆధారంగా వాటిని పూర్తిచేయండి. మీకిచ్చిన పనిని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. అనుకున్న సమయానికైనా ముందే మీరాపనిని పూర్తి చేయడం, రేపటి పనినీ ముందురోజే పూర్తి చేయడం... ఇవన్నీ మీఉద్యోగజీవితంలో పైస్థాయికి చేరేందుకు తోడ్పడతాయి. ప్రతీ విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడడం అనేది మీ అభివృద్ధికి సంకేతం అని గ్రహించండి. మీ పై అధికారి మీకిచ్చిన పనిని సక్రమంగా, అత్యుత్తమంగా పూర్తిచేయడానికి ప్రయత్నించండి. తోటి సహోద్యోగులకన్నా మీకు ఎక్కువ పని అప్పగించారంటే ‘‘అది మీ ప్రతిభ పై వారికున్న నమ్మకం’’ అని భావించండి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునేందుకు, మీ సామర్థ్యాల్ని పెంపొందించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోండి
‘‘అలభ్యలాభాది చతుష్టయం... జయతంత్రం’’ అంటాడు కౌటిల్యుడు. ఆశించిన స్థాయిని పొందాడానికి సర్వశక్తులూ ఒడ్డాలి. కష్టపడి సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న దాన్ని అభివృద్ధి పరచాలి. మీ అభ్యున్నతికి దాన్ని ఉపయోగించుకోవాలి. అదే జయతంత్రం....)/Images/Ho/office_1.jpg)
)/Images/Ho/office_1.jpg)
ఉద్యోగ జీవితంలో ఈ ‘తంత్రం’ ఓ దిక్సూచి. దిక్సూచి మార్గదర్శకంలో అపజయాలనే ప్రకృతి వైపరీత్యాలని ఎదురిస్తూ, మీనౌకని విజయతీరాలకి చేర్చడం మీలక్ష్యం. మీ పనిని ప్రేమించండి, ఇష్టంతో పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బాధ్యతల విషయంలో రాజీ పడకండి. మీతోటి ఉద్యోగులందర్నీ నవ్వుతూ పలకరించండి. అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుదరని పక్షంలో ‘నమస్కార ప్రతినమస్కారాలకే’ పరిమితం చేయండి. మీతోటి ఉద్యోగుల్ని నవ్వుతూ పలకరించండి. మీ అభిప్రాయాల్ని గౌరవించే వారితో మిత్రత్వం చేయండి. అవసరార్థం మిత్రత్వం నటించేవారిని దూరంగా ఉంచండి. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్నిష్టపడేలా మెలగండి. మీ అభిప్రాయాల్తో విభేదించే వారితో విభేదించక అంటీముట్టనట్లు వ్యవహరించండి.
మీకు బాగా మిత్రులైన వారితో తప్ప మీ వ్యక్తిగత విషయాలు, మీ అలవాట్లు ప్రస్తావించకండి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని సమయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. మీవల్ల తప్పులు దొర్లి ఉంటే నిజాయతీగా ఒప్పుకోండి. తోటి ఉద్యోగులకు మీవల్ల ఇబ్బంది కలగకుండా ప్రవర్తించండి. మీపై అభిమానంతో మీరు చేస్తున్న అపసవ్యాలను తెలియజేసేవారే మీకు నిజమైన మిత్రులని గుర్తుంచుకోండి. మీ తప్పుల్ని వారిస్తున్నారంటే మీకు మంచి చేయాలనేది వారి అభిమతం అని గ్రహించండి.
మీకన్నా వయసులో పెద్దవారైన సహచరులతో గౌరవభావంతో ఉండండి. మీకు తెలియని విషయాల్ని తెలుసుకునేందుకు సందేహించకండి. మీ మాటలే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. మాట్లాడే ప్రతీ మాటా ఆలోచించి మాట్లాడండి. అనవసర ప్రస్తావనలు తీసుకువచ్చే సహచరులను సున్నితంగా వారించండి. మీతో/మీగురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మీరేంటో సున్నితంగా తెలియజేయండి. మీ ఆత్మాభిమానానికి భంగం కలగకుండా నడచుకోండి. జీవితంలో పైకి రావాలనే కాంక్ష, ఉన్నత స్థాయిని చేరుకోవాలనే లక్ష్యం విజయ సాధనకు అవసరమైన అస్త్రాలని గ్రహించండి.
అత్యున్నత స్థాయినందుకునేందుకు... ఉత్సాహంగా ముందుకు సాగండి....
manamanthani@gmail.com
0 comments:
Post a Comment