How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మన మంథని లో బొడ్డెమ్మ పండగ

బొడ్డెమ్మ కన్నెపిల్లల కలల పండగ
చిన్నంగ సన్నంగ వలలో జల్లూ కురవంగా వలలో ఏ రాజు కురిపించే వలలో ఏడు గడియల్లు వలలో బంగారు వాన కురిసె వలలో బాలాధరి మీద వలలో బొడ్డుమప్లూలు కురిసె వలలో బోనగిరి మీద వలలో బంతిపూలు పూసే వలలో వనమెల్లా గాసె వలలో బాలలు బతుకమ్మ వలలో పండగలడిగిరి వలలో బాలలు బొడ్డెమ్మ వలలో పండగలడిగిరి వలలో - ఇలాంటి పాటలు వింటుంటే పండగల పట్ల ఉండే ఇష్టం అర్థమవుతుంది. అవును మరి. చిన్నటి సన్నటి జల్లులు కురుస్తున్న వేళల్లో, ఆ వాన చినుకులు బొడ్డు మల్లెలుగా ఉన్నాయట. బంతిపూలు వనమంతా పూసాయట. ఆ సమయంలో బాలల మనసు బతుకమ్మ ఆటను, బొడ్డెమ్మ ఆటను కోరాయట.  ఆశ్వియుజ శుద్ధ పాడ్యమినుండి నవమివరకు దసరా నవరావూతుల వేడుకలతో పాటు జరిపేది బతుకమ్మ. ఈ పాడ్యమికి ముందు వచ్చే పున్నమిని కొన్నిచోట్ల ‘బొడ్డెమ్మల పున్నం’గా పిలుస్తారు. ఈ పున్నమి తరువాత వచ్చే పంచమి అంటే భాద్రపద బహుళ పంచమి నాటి నుండి తొమ్మిది రోజులు మహాలయ అమావాస్య వరకు ‘బొడ్డెమ్మ పండగ’ జరుపుకుంటారు. బొడ్డెమ్మను ధాన్యపురాశిగా భావించి, తెలంగాణలో నిండుగా కూర్చున్నవారిని ‘‘బొడ్డెమ్మ’లా కూర్చున్నావు’’ అనడం పరిపాటి.  ‘బొడ్డెమ్మ’ అనే పేరుకు ‘బొట్టె’, బొడిప’, పొట్టి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ‘బొడ్డ’ అనే పదానికి ‘అత్తిచెట్టు’ అనే మరో అర్థం కూడా ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అనీ పిలుస్తారు. సాధారణంగా సంతానం కల్గాలని, వివాహం కుదరాలని ఉదంబరాన్ని పూజిస్తుంటారు. ఆపరంగా ప్రకృతిని కూర్చి ఈ ఉదంబర/మేడి పూజనే ‘బొడ్డపూజ’గా మారి ప్రచారం పొందిందని అనుకోవచ్చు.  బొడ్డెమ్మ ఆటపాటలను ‘గర్భో’ నృత్యంతో పోల్చవచ్చు. ‘గర్భో’ అంటే ‘గొబ్బి’ అని ఒక అభివూపాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలు, పిల్లలతో పూజలందుకుంటుంది. అంతేకాదు, గిరిజనులు నిర్వహించే పండగలలో ‘కన్నెపిల్లలు, బాలికలు ఎంతో సంబురంగా తమ పెళ్లి ఘనంగా, మంచిగా జరగాలని కొలిచే పండగ ‘థీజ్ పండగ’. ఈ పండగను కూడా 9 రోజులు (ఇంచుమించు) కన్నెలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు సాయంకాలం ఆడి పాడుతుంటారు. థీజ్ పండగకు బొడ్డెమ్మ, బతుకమ్మ పండగలకు కూడా పోలిక ఉందని చెప్పవచ్చు.
  బొడ్డెమ్మ పండగ విధానం
మనం ప్రకృతి పురుషులను స్త్రీ శక్తి సమాహారంగా భావిస్తూ, శక్తి స్వరూపిణిని ఎన్నో విధాలుగా పూజిస్తాం. త్రికోణం, త్రిభుజం శక్తి రూపంగా కొలిచే విధానం ‘బొడ్డెమ్మ’లో కనిపిస్తుంది.బొడ్డెమ్మను సాధారణంగా ఈ విధంగా తయారు చేస్తారు. ఒక పీట మీద పుట్టమన్నుతో ఐదు దొంతరులుగా పేర్చి ఒకటి త్రిభుజాకారంతో గోపురంగా వేస్తారు. చెక్కపీటపై నాలుగువైపుల నాలుగు మట్టి ముద్దలను పెట్టి, వాటిని బొడ్డెమ్మ బిడ్డలని పిలుస్తారు. ఈ త్రికోణ శిఖరంపై కొన్ని చోట్ల వెంపలి చెట్టును పూజిస్తారు. మరికొన్ని చోట్ల బియ్యంతో నింపిన కలశం చెంబును ఉంచి దానిపై కొత్త రవికె బట్ట, అందులో రెండు తమలపాకులు, వాటిలో ‘పసుపు గౌరమ్మ’ను ఉంచుతారు. పీటను ముగ్గులతో అలంకరిస్తారు. గౌరమ్మను పూలు, పసుపు కుంకుమలతో కలశాన్ని, బొడ్డెమ్మను రంగురంగుల పూలతో కొలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పుకుంటారు.
  అవి 1. పీట బొడ్డెమ్మ 2. గుంట బొడ్డెమ్మ 3. పందిరి బొడ్డెమ్మ 4. బాయ బొడ్డెమ్మ చెక్కపీటపై పుట్టమన్నును ఐదు దొంతర్లుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం ‘పీట బొడ్డెమ్మ’ ప్రత్యేకత.  గుంటల రూపంలో బొడ్డెమ్మను చేసేది ‘గుంట బొడ్డెమ్మ’.  పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి దాని చుట్టూ పందిరి వేస్తారు. అది ‘పందిరి బొడ్డెమ్మ’.  బావిలాగా గొయ్యి తీసి తయారు చేసేది ‘బాయి బొడ్డెమ్మ’.  -ఇలా ఏ రకంగా తయారు చేసినా ప్రకృతిని, భూమాతను ఒకచోట చేర్చి పూజించడం తెలంగాణ బిడ్డలకు మట్టి పట్ల, చెట్టు-చేమల పట్ల ఉన్న భక్తిని, ప్రేమను చూపుతుంది. బొడ్డెమ్మను కూడా బతుకమ్మ రీతిలో పలు రకాల పూలతో పూజిస్తారు. రుద్రాక్ష, కాకర, కట్ల, బీర, మల్లె, జాజి, తంగేడు పూలతో కొలుస్తారు.  సాయంకాల వేళ ఎవరి ఇంటి ముందు వారు బొడ్డెమ్మను నిల్పి పూలతో, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. కొన్నిసార్లు అందరూ కలసి ఒకచోట చేరుతారు. ఆడపిల్లలు, కన్నెపిల్లలంతా బొడ్డెమ్మ చుట్టూ చేరి చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడతారు. ఒకరు పాట చెబుతుంటే మిగతా ఆడపిల్లలందరూ పాడుతుంటారు. పెద్దవారు కూర్చుని చూస్తూ ఆనందిస్తారు. ఆట అనంతరం బొడ్డెమ్మలను వారి వారి ఇండ్లకు తీసుకెళ్తారు. తిరిగి తెల్లవారి సాయంకాలం మళ్లీ బొడ్డెమ్మలను తీసుకొని ఒకచోట చేరి ఆడుకుంటారు. ఆడుతూ ఎన్నో పాటలు పాడుతుంటారు. ఆట ఆనంతరం ఏదో ఒక తీపి పదార్థాన్ని ‘ప్రసాదం’గా పంచుకుంటారు. బొడ్డెమ్మ పండగ తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో మరింత ఎక్కువగా జరుపుకుంటారు.  బొడ్డెమ్మ ఆటల్లో, పాటల్లో మన సంస్కృతి స్పష్టమవుతుంది. కన్నెపిల్లలు చక్కగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా ఒకచోట చేరడం వల్ల మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అర్థమవుతాయి. పెద్దవారు పూజించిన రీతిలో వారు కూడా గౌరీపూజ చేసి తమకు మంచి జరగాలని వేడుకుంటారు. మంచి భర్త రావాలని కూడా మొక్కుకుంటారు. జట్టుగా మసలుకోవడం నేర్చుకుంటారు. పెద్దవారి నుండి తాము నేర్చుకున్న పాటలను లయబద్ధంగా పాడుకుంటారు. ఈ ఆట పాటలను ఒకరి నుండి ఒకరు అంది పుచ్చుకుంటారు. ఈ పాటలు జానపదుల, పల్లెవూపజల జీవన విధానాలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని, పురాణకథలను, నిత్య జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలను కళ్లకు గట్టినట్లుగా చూపిస్తాయి. వింటూ ఉంటే ఈ పాటలన్నీ చిన్ననాడు తాము పాడినవే అన్నట్టుగా అనిపిస్తాయి.  
ఈ పాటను చూడండి: 
ఒక్కేసి పూవేసి చందమామ ఒక్క ఝాము ఆయె చందమామ ఒక్క ఝాము ఆయె చందమామ శివపూజ వేళాయె చందమామ శివపూజ వేళాయె చందమామ శివుడింక రాడాయె చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు ఝాములాయె చందమామ రెండు ఝాములాయె చందమామ శివపూజ వేళాయె చందమామ శివపూజ వేళాయె చందమామ శివుడింక రాడాయె చందమామ -తెలంగాణ ప్రాంతంలో ఈ పాటను తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో -బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరు మల్లె చెట్టును నాటిందట. దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్యయైన గౌరమ్మను తమ ఆడ బిడ్డగా భావిస్తూ, ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. తమకు వివాహం కావాలని గౌరిని ప్రార్థించినట్లు ఈ కింది పాటలో చూడవచ్చు:  మాలుమర్తి మేడ మీద చందమామ వెండియ్య వెనగరలు చందమామ వెండియ్య వెనగరలకు చందమామ ఇత్తడియ్య చేరెలు చందమామ ఇత్తడియ్య చేరెలకు చందమామ రాగియ్య కవడలు చందమామ  -అంటూ సాగే ఈ పాటలో మంచినీళ్ల బావి పక్క చందమామ మంచి మల్లె తీగెబుట్టె చందమామ కోసెవారు లేక చందమామ కొండెత్తు పెరిగి పాయె చందమామ కోయించు చందప్ప చందమామ పంచిపెట్టు గౌరమ్మ చందమామ -అని కోరుకుంటారు. ఎంతోమంది కన్నెలు, స్త్రీలు పాడుకునే బొడ్డెమ్మ పాటను చూద్దాం. ఈ పాటను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాడుకుంటారు. పెళ్లయిన స్త్రీలు తమ పుట్టింటి వారు తమను చూసి పోవాలని కోరుకుంటారు. ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్క ఊరికి ఇస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడు ఉయ్యాలో ఏం చేతు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డామాయె ఉయ్యాలో ఏరుకు ఎంపలి ఉయ్యాలో తోటడ్డామాయె ఉయ్యాలో - ఆడపిల్లకు అన్నలంటే బాగా ఇష్టం. ఒకే ఊరికి ఇద్దరక్క చెల్లెళ్లను ఇచ్చారు. అయినా వారిని చూసి రావడానికి అన్నకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. ఈ పాటలో అన్న రాక పోవడానికి కారణం పనుల ఒత్తిడే అని చెప్పుకోవడంలో స్త్రీలకు పుట్టింటి వారిపై గల ప్రేమను చూపిస్తుంది. మరో పాటను చూద్దాం. కన్నెపిల్లలు ఎన్నో కలలు కంటూ జీవితాన్ని పెళ్లితో ముడి వేసుకుంటారు. అయినా కుటుంబ స్థితిగతులను, అత్తింట్లో మెలిగే తీరును, పుట్టిల్లు చెరితే కలిగే నష్టాన్ని తెలుసుకుంటారు. చిలక కొరికిన పాక ఉయ్యాలో చిట్లించరాదు ఉయ్యాలో చిట్లించి చిన్ననాట ఉయ్యాలో మాట పడరాదు ఉయ్యాలో మాటపడి పత్నింట ఉయ్యాలో మరి ఉండరాదు ఉయ్యాలో  -అంటూ సాగే పాటను మరోచోట ఈ రకంగా పాడుకుంటారు. చిలుక కొరికిన పండు ఉయ్యాలో చింతించరాదు ఉయ్యాలో అమ్మ నీ కోడళ్లు ఉయ్యాలో బద్దించరాదు ఉయ్యాలో బద్దించి వదినెతో ఉయ్యాలో మాట పడరాదు ఉయ్యాలో  -అని చెప్పుకుంటూ, పుట్టిల్లు పెళ్లి తర్వాత ఉండడానికి వీలు కానిదని, మెట్టిల్లే స్త్రీకి స్థిరమనీ చెబుతుంటారు. ఈ పాటలో అన్న, తమ్ముడు, వదినెలపై ప్రేమలు, తల్లి మమకారం కూడా తెలుస్తుంటయి. కోలో, వలలో, ఉయ్యాలో, చందమామ అనే పల్లవులు తిరిగి రావడం ఈ పాటలకు శృతి లయలను కల్గించి అందాన్నిస్తాయి. మౌఖికంగా, ఆశువుగా సాగే బొడ్డెమ్మ పాటల్లో బతుకమ్మ పాటల్లానే జీవన సత్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పండగ పాటలు కన్నె పిల్లల ఆకాంక్షలను తెలియజేస్తూ వాళ్ల మనసుకు అద్దం పడతాయి. చిన్నచిన్న గుళ్లు వలలో చిత్తారి గుళ్లు వలలో  +++ చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నంపు గాజులు ఉయ్యాలో  అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరియు ఉయ్యాలో +++ రెండేసి తప్కుల్లా వలలో ముత్యాలు పోసి వలలో  ఇమ్మడీ కుచ్చులా వలలో సొమ్ములు బెట్టి వలలో -ఇట్లాంటి పాటలు ఆడపిల్లల కోరికలను, వారు ముస్తాబయ్యే విధానాన్ని వారి మానసిక సౌందర్యాన్ని చక్కగా తెలియజేస్తాయి.  -తొమ్మిది రోజులు ఇలా ఆటపాటలతో సాగిన బొడ్డెమ్మ పండగ తొమ్మిదవ రోజున బొడ్డెమ్మను నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. గౌరమ్మకు ప్రతీకగా భావిస్తూ బొడ్డెమ్మను సాగనంపుతూ జోల పాడటం విశేషం.  నిద్రపో బొడ్డెమ్మా -నివూదపోవమ్మా నిద్రకు నూరేండ్లు - నీకు వెయ్యేండ్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు, నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు నిద్రపో బొడ్డెమ్మా -నివూదపోవమ్మా అంటూ సాగే ఈ పాటలో తల్లుల మనసు ఆర్థమవుతుంది.  తమ కోరికలు తీర్చాలని కోరుతూ సాగనంపుతూ, మళ్లీ సంవత్సరం రమ్మని కోరుకోవడం మరో విశేషం. ఈ విధంగా బొడ్డెమ్మ పండగ తెలంగాణ కన్నెపిల్లలు, బాలికల కలల కనుల పండగగా ప్రశస్తి పొందింది. ప్రకృతి బిడ్డలుగా పల్లె సీమల్లో వ్యవసాయ ఆధారంగా బతికిన పల్లె జీవులకు ప్రకృతి ఆరాధనే గొప్ప పండగ. అందరినీ కాపాడే గౌరమ్మనే బతుకమ్మగా నమ్మే తెలంగాణ స్త్రీలు, ప్రజలు బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకుంటారు. తరతరాలుగా జన సమూహంలో నిలిచి ఉన్న ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు రూపమే పండగలు!  బొడ్డెమ్మ ఆటల్లో, పాటల్లో మనదైన సంస్కృతి స్పష్టమవుతుంది. కన్నెపిల్లలు చక్కగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా ఒకచోట చేరడం వల్ల మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు పరస్పరం అర్థమవుతాయి. ఒకే ఊరికి ఇద్దరక్క చెల్లెళ్లను ఇచ్చారు. అయినా వారిని చూసి రావడానికి అన్నకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. ఈ పాటలో అన్న రాక పోవడానికి కారణం పనుల ఒత్తిడే అని చెప్పుకోవడంలో స్త్రీలకు పుట్టింటి వారిపై గల ప్రేమను చూపిస్తుంది.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE