శాంతమూర్తిగా వెలసిన సుందిళ్ల యోగ నరసింహస్వామి! నృసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఉగ్రమూర్తి. కానీ, కరీంనగర్ జిల్లా సుందిళ్ల గ్రామంలో శాంతమూర్తి. మిగతా ప్రదేశాలలో కొండలు, గుట్టల్లో వెలిస్తే ఇక్కడ మాత్రం అందమైన కోవెలలో కొలువైనాడు.
పూర్వం హిరణ్యకశిపుని చంపి, ప్రహ్లాదుని రక్షించిన తర్వాత నృసింహస్వామి అవతార ధర్మం పూర్తవుతుంది. అదే ఉగ్రరూపంతో అనేక చోట్ల భక్తుల కోసం స్థిరపడడం మనకు తెలుసు. కానీ, సుందిళ్ల స్వామిది వేరే కథ. భయంకరమైన ఆ ఉగ్రరూపంతో ఉన్న నరసింహస్వామి ఇక్కడి పవిత్ర గోదావరి నదిలో తన గోళ్ళు, కాళ్ళు కడుక్కున్నాడట. గోదావరి నీరు ముఖంపై పడగానే, వాటిని ఆయన దోసిలితో తాకగానే శాంతమూర్తిగా మారాడంటారు భక్తులు. పచ్చని ప్రకృతిగల ఈ నిశ్శబ్ద ప్రాంతాన్ని నృసింహస్వామి తన తపస్సుకు అనుకూలమైన స్థలంగా భావించాడు. శాంతమూర్తిగా మారిన తర్వాత ఇక్కడే యోగమువూదలో కూర్చున్నాడు. అప్పుడు స్వామి ఒళ్లంతా పుట్టలు పెట్టాయి. ఇంతటి మహిమాన్విత స్థితిలో నరసింహస్వామి వెలసిన చోటు మరెక్కడో లేదు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ గ్రామంలో ఉంది.
స్థల పురాణం: సుందిళ్ల ఆలయ పౌరాణిక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక బ్రాహ్మణుడు జనగామలో నివసిస్తూ చేరువలోనే ఉన్న సుందిళ్ళలోని తన పొలాలకు వచ్చేవాడు. అసలే అది అడవి ప్రాంతం. అందులో ఆ వృద్ధుడు తన పదేళ్ళ మనుమని వెంట బెట్టుకొని అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఒకనాడు మనమడెందుకో రాలేకపోయాడు. ఒక్క బ్రాహ్మణుడే పొలంలో తిరిగి అలసిపోయి దారితప్పుతాడు. అంతలోనే చీకటి పడుతుంది. దాంతో తన ఊరికి ఎటువైపు వెళ్ళాలో తెలియక ‘హా భగవంతుడా! ఏమిటి చేయడం. దారి తెలియక తిరుగుతున్న నాకు నీవే దిక్కని’ భక్తితో భగవంతుని స్మరించుకున్నాడు. తలచిందే తడువుగా ఒక బాలకుడు, తన మనుమని వయస్సువాడే పహ్లాదుడు) అతని దగ్గరకు వస్తాడు. ‘‘తాతా! దారి తప్పావా! సరైన త్రోవ నేను చూపిస్తాను రా!’’ అని తీసుకొని పోతాడు. ‘‘ఈ రాత్రి ఈ మంటపంలో పడుకో. ఇదిగో... స్వామి ప్రసాదం. కొబ్బరి, బెల్లమున్నది తిను’’మని ఇచ్చి పడుకున్నాడు. ‘‘సరే’’ అని బ్రాహ్మణుడు ప్రసాదం తినేసి, అలసిపోవడంతో భుజంపైన వేసుకొన్న పంచె పరచుకొని పడుకున్నాడు.
అర్ధరాత్రి అతని కలలో విష్ణుమూర్తి నృసింహ రూపంలో దర్శనమిస్తాడు. ‘‘నేను నీ పక్కనే ఉన్నాను. భయపడకు. పుట్ట తవ్వి చూడ’’మన్నాడు. కళ్ళు తెరిచి చూసే సరికి తెలతెలవారుతున్నది. పక్కలోని బాలుడు లేడు. పుట్టదగ్గర చెవి పెట్టాడు. ఉచ్ఛాస నిశ్వాసల్లోంచి బీజాక్షరాలు వినిపించసాగాయి. అంతా అయోమయం. తాను నిరంతరం పూజించే నారాయణమూర్తి తనను ఉద్ధరించ వచ్చాడని గ్రహించాడు. గబగబ ఇంటికి వెళ్ళాడు. స్నాన పానాదులు, నిత్యకృత్యాలు ముగించుకొని గునపం చేత పట్టుకొని, మనుమన్ని వెంట బెట్టుకొని సుందిళ్ళకు జనగామ నుండి వచ్చాడు. పుట్ట పూర్తిగా తవ్వేసరికి మూడు రోజులు పట్టింది. నిద్రాహారాలు మాని పుట్ట తవ్వుతుంటే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అతనిని చూసి ‘పిచ్చిపట్టింద’న్నారు. నాల్గవ రోజు తెల్లవారక ముందే గునపం తీసుకొని మట్టిని తొలగించసాగాడు. కుడివైపు గునపం దెబ్బ తగలగానే ‘‘అబ్బా ఆపరా!’’ అనే మూలుగు వినిపించిందిట. అంతే! తన అపరాధాన్ని తెలుసుకొని, తాను తాగటానికి తెచ్చి పెట్టుకున్న గోదావరి నీళ్ళతో దెబ్బ తగిలిన భాగాన కడిగాడు. చేతికి రక్తపు మరక, ఆ భాగమంతా ఎరుపు రంగు. సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకొని, చేతులు యోగమువూదతో వున్న శిలా విగ్రహాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాడు. ఛాతి ఒకవైపు నలుపు, మరో పార్శం ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహం. అయితే, స్వామి దక్షిణాభి ముఖంగా దర్శనమిచ్చాడు. దక్షిణ ద్వారం (దిక్కు) యమధర్మరాజుది. ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని పెద్దలు అంటారు.
కాకతీయులు కట్టిన ఆలయం: క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయరాజ వంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్లు సమీపంలోని ఓ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. దేవాలయానికి ఈశాన్య భాగంలో 200 గజాల దూరాన పురాతన దేవాలయమున్నట్లు ఆలయ శిథిలాలు నేటికీ దర్శనమిస్తాయి. అయితే, నైరుతి దిశలోని కోనేరును కూడ్పించి, ఆ స్థలంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలును దాతలు నిర్మించారు. శాసన భాష లిపి మాదిరిగా ఉన్నా అక్షర క్రమం సరిగా అర్థం కాకుండా ఉంది. గతకొద్ది కాలం క్రితం భక్తుల కోరిక మేరకు శ్రీలక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించారు. ఈ గుడికి పడమరన 50 గజాల దూరాన కాకతీయుల కాలం నాటి శివాలయం, 100 గజాల దూరాన హన్మంతుని దేవాలయం ఉండటంతో నాడు శివకేశవ భేదం ఇక్కడ పాటించలేదన్నది స్పష్టమవుతోంది. అంతేగాక, సుందిళ్ళ- వేలాల ఎదుదురు ప్రాంతాలు. మధ్యలో గోదావరి, యోగ నృసింహస్వామి, ఆ ఒడ్డున వేలాల మల్లన్న. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం ధ్యానానికి, తపస్సుకు అనువైన ‘మోక్షభూమి’గానూ అనాదిగా ప్రసిద్ధమైనట్టు స్థానికులు చెప్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో భజన సప్తాహం జరుగుతుంది. కుందారం, సెట్టిపెల్లి, శివ్వారం చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే, ప్రతి ఏడూ ఫాల్గుణ మాసంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేగాక, ప్రతినెలలో ఎవరో ఒకరు దూరవూపాంతాల నుండి వచ్చి ఏకాహం (24 గంటల భజన) చేసి అన్నదానం చేస్తారు. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే ఈతి బాధలనేకం తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. మానసికంగా బాధపడ్తున్న వారిని, బాలారిష్టాలున్న పిల్లలను తీసుకొని వచ్చి నిద్ర చేయిస్తే, వారికి బాధలు తీరి, సుఖ సంతోషాలతో గడుపుతారంటారు. ఈ మేరకు అలాంటి వారి గాథపూన్నో ప్రత్యక్ష నిదర్శనంగా ప్రజలు వినిపిస్తారు. భక్తులు ఆలయంలో ఉండటానికి వసతి గదులున్నాయి. 24 గంటలు మంచి (తియ్యని) నీరు అందుబాటులో ఉంటాయి. ఆలయ సిబ్బంది, అర్చకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. స్వామిని ఈ ప్రాంతంలో గుర్తించిన బ్రాహ్మణుని ఐదవ తరం పూజారి జయంత్‌శర్మ (సుందిళ్ళ నర్సయ్యగారి 6వ కుమారుడు) ఇప్పుడు అర్చకుడిగా ఉన్నారు. మొక్కులు తీర్చుకునే వారేకాక, స్వామి వారి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి కూడా అనువైన పెద్ద హాలు, ఆచార్యులు అందుబాటులో ఉంటారు. ఎండు కొబ్బరి కుడుకలో బెల్లం స్వామికి, ఓడి బియ్యం అమ్మకు పెట్టడం చాలా శ్రేష్టమని పండితులు చెప్తారు.
0 comments:
Post a Comment