How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

రాఖీ పౌర్ణమి. Special Article




 


శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి. 



మన  మంథని  సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.

భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. 
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.

దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. 

యజ్ఞోపవీతం పరమపవిత్రం 
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం 
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. 
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే 'ఉపాకర్మ' అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే 'యజ్ఞోపవీతం' అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని 'నూలి పున్నమి' అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్న వారిని ''ద్విజులు'' అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం 'జ్ఞానాధ్యయనం' గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడు తుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.
ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ'జంధ్యాల పూర్ణిమ' కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు

''యజ్ఞోపవీతం, పరమం పవిత్రం
ప్రజా పతే: యత్‌ సహజం పురస్తాత్‌
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:''

అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.

యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||

ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని 'బ్రహ్మముడి' అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.

జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవు తాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం||లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం. ఈ రోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రీ మంత్రాన్ని జపిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.



"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు.


 దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"

"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE